కోవిడ్ 19 విజృంభణ కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఆల్రెడీ షూటింగ్ జరుపుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సినిమాల నిర్మాతలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల వైపు చూస్తున్నారు. థియేటర్లు తెరుచుకునే వరకూ సినిమాని తమ దగ్గరే పెట్టుకోవడం వల్ల లాభం లేదనుకుంటున్నారో ఏమో, ఎంతొస్తే అంతకి అమ్మేసి ఆర్థికంగా మరీ దిగజారిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల అమృతరామమ్ జీ5 ద్వార విడుదలైన విషయం తెలిసిందే, సురేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలేదని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా మరో చిత్రం విడుదల కానుంది. అందాల రాక్షసి ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన హీరో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న భానుమతి రామక్రిష్ణ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.
సలోనీ లుత్రా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని హాట్ స్టార్ యాజమాన్యానికి చూపించారట. వారు ఈ సినిమా నచ్చి కొనుక్కున్నారని టాక్ వినబడుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాని హాట్ స్టార్ లో చూడబోతున్నాం అని అంటున్నారు. అమృతరామమ్ తర్వాత డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రం ఇదే కానుంది.