కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తోన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ఎంతో మంది రాజకీయ, సినిమా, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినీ సెలబ్రిటీలు తమకు తోచినంత విరాళాలు.. పేదలకు రేషన్ సరకులు, సినీ కార్మికులకు నిత్యావసరాలు ఇలా పంచిపెడుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ హీరోలు తమ మంచి మనసు చాటుకున్నారు. తాజాగా.. స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా సాయం చేశారని.. అందరిలాగా కాకుండా కాస్త వెరైటీగా అని ప్రస్తుతం ప్రాంతీయ మీడియా మొదలుకుని జాతీయ మీడియా వరకు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తనను సాయం కోరితే కాదనకుండా మనసుకు నచ్చినంత ఇచ్చేసే అమీర్.. కరోనా కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు గోధుమ పిండి పంచారట. పిండి పంచితే అందులో వింత ఏముంది..? అదేం పెద్ద విషయమా..? పిండే కదా..? అని అనుకుంటున్నారు కదూ.. ఆ గోధుమ పిండి సంచుల్లో రూ. 15వేలు నగదు పెట్టి పంచారట. పిండే కదా మనకెందుకులే అని కొందరు అనుకోగా... ఏదైతేనేం అసలే లాక్ డౌన్ కదా అని పేదలతో చాలా మందే క్యూ కట్టి మరీ తీసుకున్నారు. అయితే ఇంటికెళ్లి చూడగా 15వేల రూపాయిలు నగదు ఉండటాన్ని ఒకింత కంగుతిని.. ‘అయ్యా మీరు దేవుడయ్యా’ మెచ్చుకున్నారట. ఈ ఘటన ఢిల్లీలోని పేద ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ట్రక్‌లో గోధుమ పిండి బ్యాగ్‌లు పంపిన అమీర్..వాలంటీర్లతో పంచి పెట్టారట.
నిజమా.. అబద్ధమా..!?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం బాగా ట్రెండింగ్ అవుతోంది. అయితే తాను సాయం చేసినట్లు కానీ.. 15 వేల లెక్కపై కానీ అమీర్ పెదవి విప్పలేదు. తోచినంత సాయం చేయాలి అంతేకానీ పబ్లిసిటీ ఎందుకులే అని స్టార్ హీరో సైలెంట్‌గా ఉన్నాడా..? లేకుంటే ఇదంతా ఫేక్ న్యూసా..? అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. వాస్తవానికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. ఇది నిజంగా జరిగిందా లేకుంటే అభిమానులు అత్యుత్సాహంతో ఇలా చేస్తున్నారా..? అనేదానిపై క్లారిటీ రావాలంటే స్వయంగా అమీర్ స్పందించాల్సిందే మరి.