సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చిట్టి బాబుగా మాస్ పాత్రలో పల్లెటూరి మొరటోడు పాత్రలో గెడ్డం పెంచి రఫ్ లుక్ లో ఇరగదీసాడు. రంగస్థలం సినిమాలో కథకి ఎంత బలం ఉందో... ఆ సినిమాలోని పాత్రలకు అంతే బలం ఉంది. లుంగీ, గళ్ళ చొక్కా, పెరిగిన గెడ్డం ఇలా రామ్ చరణ్ పాత్రకి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. ఇక అదే చిత్రంలో హీరోయిన్ సమంత కూడా లంగా వోణి వేసి సైకిల్ తొక్కుతూ వ్యవసాయం చేసుకునే అమ్మాయిగా రామలక్ష్మి పాత్రలో ఓల్డ్ పల్లెటూరి గెటప్‌లో అదరగొట్టేసింది. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న వాల్మీకి సినిమాలోని హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ పూజా హెగ్డే పాత్రల తీరుతెన్నులు చూస్తుంటే... ఎక్కడో రంగస్థలంలోని పాత్రలకు కనెక్ట్ అవుతున్నారనిపిస్తుంది.
వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ రఫ్ గా గెడ్డం పెంచి రంగస్థలంలో రామ్ చరణ్ ని గుర్తు చేసాడు. తాజాగా వాల్మీకి హీరోయిన్ పూజా హెగ్డే లుక్ చూస్తుంటే... రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర చేసిన సమంత గుర్తొస్తుంది. పూజా హెగ్డే కూడా పల్లెటూరి అమ్మాయిలా లంగా వోణి వేసుకుని సైకిల్ తొక్కుతూ ఉన్న దేవి (పూజ) పాత్ర చూస్తుంటే నిజంగా సమంత గుర్తు రావడం ఖాయమంటున్నారు. మరి వరుణ్, చరణ్‌ని పోలి ఉంటే.... పూజా, సమంత పాత్ర పోలికలతో ఉండడంతో.. అందరూ ఇప్పుడు రంగస్థలాన్ని గుర్తు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక వరుణ్ తేజ్ - పూజా హెగ్డేల వాల్మీకి వచ్చే నెల 13న విడుదల కాబోతుంది.