నిజానికి ప్రతి ఒక్కరికి జయాపజయాలు సాధారణం. అందునా సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ కలగలిపి ఉంటాయి. అయితే సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయా దర్శకులు తమ టాలెంట్‌తో మెప్పిస్తే మరలా మరలా అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్లాప్ దర్శకులతో చిత్రాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ డైరెక్టర్‌లో టాలెంట్ ఉందా? లేదా? అనేదే ముఖ్యం.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌గా రమేష్ వర్మకి మంచి పేరుంది. ఆయన దర్శకునిగా మారి తరుణ్ హీరోగా ‘ఒక ఊరిలో’ చిత్రం తీశాడు. ఇది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘రైడ్’ ఫర్వాలేదనిపించినా, రవితేజ వంటి హీరో చాన్స్ ఇస్తే దానిని ‘వీర’ పేరుతో వృధా చేసుకున్నాడు. ఇక ‘అబ్బాయితో అమ్మాయి, వస్తా నీ వెనుక’ చిత్రాలు కూడా దారుణంగా దెబ్బతీశాయి. అలాంటి దర్శకునితో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ చిత్రం చేస్తున్నాడు.
నిజానికి రమేష్ వర్మకి బెల్లంకొండ సురేష్‌తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తమిళంలో హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రానికి ఇది రీమేక్‌గా సైకో థ్రిల్లర్‌గా ఇది రూపొందనుంది. తన కెరీర్‌లో ‘తొలిప్రేమ’ మినహా పెద్దగా హిట్స్‌లేని రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ఈ పాత్రను అమలాపాల్ పోషించింది. మరి కనీసం ఇలాంటి హిట్ రీమేక్ ద్వారా అయినా రమేష్‌వర్మ తనని తాను ప్రూవ్ చేసుకుని బెల్లంకొండ హీరోకి హిట్ ఇస్తాడో? లేదో? వేచిచూడాల్సివుంది. ఇక దీనితోపాటు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్‌గా ‘సీత’ చిత్రం చేస్తున్నాడు.
త్వరలో ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో కూడా నటించడానికి ఓకే చెప్పాడు. ఇలా వరుస చిత్రాలతో బెల్లంకొండ దూసుకుపోతున్నా చెప్పుకోదగిన హిట్ మాత్రం ఆయనకు ఇప్పటివరకు రాలేదు. అయినా థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్, ఇతర భాషల్లో అనువాదం వంటి వాటి ద్వారా ఆయన ఎంతో కొంత నిలబడుతున్నాడు. మరి బెల్లంకొండ కెరీర్‌కి ఈ రెండేళ్లు చాలా కీలకమనే చెప్పాలి.