అవసరాల శ్రీనివాస్ హీరోగా కె.ఆర్. క్రియేషన్స్ ‘నాయనా రారా ఇంటికి(ఎన్.ఆర్.ఐ)’ ప్రారంభం
అవసరాల శ్రీనివాస్ హీరోగా కె.ఆర్. క్రియేషన్స్ పతాకంపై బాలరాజశేఖరుని దర్శకత్వంలో ప్రదీప్ కె.ఆర్. నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘నాయనా రారా ఇంటికి(ఎన్.ఆర్.ఐ)’. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటి అక్కినేని అమల క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్ షాట్‌ను బాలరాజశేఖరుని డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ ప్రారంభోత్సవానికి హీరోలు నాని, సుమంత్, సుశాంత్, నాగశౌర్య, అఖిల్, మంచు లక్ష్మి, ప్రముఖ రచయిత, దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ మహతి, నటుడు నాగబాబు, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నిర్మాత ప్రదీప్ కె.ఆర్., దర్శకుడు బాలరాజశేఖరుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
దర్శకుడు బాలరాజశేఖరుని మాట్లాడుతూ.. ‘‘నాయనా రారా ఇంటికి అనడంలో రకరకాల అర్థాలు వస్తాయి. ఒక్కో రకమైన ఎమోషన్‌తో అంటూ ఉంటే ఒక్కో అర్థం వస్తుంది. అయితే నాయనా రారా ఇంటికి అని ప్రాధేయ పడే సినిమా కాదు. ఇది హైలీ ఎనర్జిటిక్ రొమాంటిక్ కామెడీ మూవీ. అలాగే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫ్యామిలీ మూవీ. అవసరాల శ్రీనివాస్‌గారికి ఒక జిమ్ క్యారీగా, చార్లీ చాప్లిన్‌గా, యంగ్ రాజేంద్రప్రసాద్‌గా చూద్దామని కోరుకుంటున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. డైరెక్ట్‌గా నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. దీన్ని స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. కానీ, ఒక చిలిపి క్యారెక్టర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పదలుచుకున్నాను. ఈ కథను శ్రీనివాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. హీరోయిన్‌గా రకరకాల భాషల అమ్మాయిల్ని చూశాం. కానీ, తెలుగు మాట్లాడగలిగి ఉండాలి. తెలుగమ్మాయి అయి ఉండాలి. అందుకే భిక్షుగారి అమ్మాయి మహతిని సెలెక్ట్ చెయ్యడం జరిగింది. ఈ సినిమాకి పాటలు సీతారామశాస్త్రిగారు రాస్తున్నారు. వాళ్ళబ్బాయి యోగేశ్వరశర్మ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొదట మేము రెండు సినిమాలు అనుకున్నాం. హాలీవుడ్ రీమేక్ ఒకటి కాగా, మరొకటి ఈ సినిమా. ఈ రెండింటిలో ఏది ముందు చెయ్యాలి అనే కన్‌ఫ్యూజన్‌లో బి.ఎ.రాజుగారి దగ్గరకు వెళ్ళాం. ఆయనకు 1500 సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆడియన్స్ పల్స్ ఏమిటి అనేది బాగా తెలుసు. మేం అనుకున్న రెండు సబ్జెక్ట్స్ చూసి ‘నాయనా రారా ఇంటికి’ చెయ్యండి అని చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు. నేను ఇండియా రావడానికి రీజన్ అక్కినేని అమలగారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌కి డీన్‌గా వస్తారా అని అడిగారు. చాలా అదృష్టంగా భావించాను. చాలా సంతోషంగా ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. ఈ స్కూల్‌లో డీన్‌గా పనిచేసి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని ఈ సినిమా చేస్తున్నాను. అమలగారు మా సినిమాకి క్లాప్ ఇవ్వడం అనేది నా అదృష్టం. అమలగారికి, నాగార్జునగారికి, అక్కినేని ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు’’ అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ... ‘‘బాల ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సాధకబాధకాల్ని చవి చూశాడు. అలాగే విజయాలు కూడా చవి చూశాడు. బాలరాజశేఖరుని అంటే స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లాంటి వారికి మంచి మిత్రుడు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి సినిమా తీద్దామనుకునే వారికి ఎంతో సహాయపడేవాడు. అతను డైరెక్టర్ అయితే బాగుంటుందన్న కోరిక నాకు ఎప్పటి నుంచో వుంది. ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నాడని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఈ సినిమాతో దర్శకుడుగా బాల మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు.
మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ... ‘‘బాలరాజశేఖరుని పేరు ఎంత చక్కగా ఉంటుందో మనిషి కూడా అంత మంచివాడు. ఆయనకు చాలా డిగ్రీలు ఉన్నాయి. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో డీన్‌గా పనిచేస్తున్నారు. అన్నపూర్ణలోనే ఐదు సంవత్సరాలు జబర్దస్త్ చేసినా మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ సినిమా ద్వారా మేం కలవడం జరిగింది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కొన్ని సినిమాలు డబ్బు కోసం చేస్తాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం బాల వ్యక్తిత్వం నచ్చడం. చాలా మంచి కథ ఇది. పిల్లల్ని మిస్ అయిన తల్లిదండ్రుల పెయిన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చెయ్యడం జరిగింది’’ అన్నారు.
సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ మాట్లాడుతూ... ‘‘బాలగారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది’’ అన్నారు.
హీరోయిన్ మహతి మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నన్ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థాంక్స్. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలన్నది నా చిన్ననాటి కల. ఈ సినిమాతో నా కల నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా కథ నచ్చి అందరూ చెయ్యడానికి ఒప్పుకున్నారు. అందర్నీ ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది’’ అన్నారు.
నిర్మాత ప్రదీప్ కె.ఆర్. మాట్లాడుతూ... ‘‘బాలగారికి, కిరణ్‌గారికి, మా పేరెంట్స్‌కి, అందరికీ థాంక్స్. గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆశీస్సులతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. అంతే గ్రాండ్‌గా ముహూర్తం చేసుకుంటున్నాం. అంతే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం. బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాం. ఈ సినిమా స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది. మార్చి ఎండింగ్‌లోగానీ, ఏప్రిల్ స్టార్టింగ్‌లో గానీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అమెరికాలో, ఇండియాలో షూటింగ్ జరుగుతుంది’’ అన్నారు.
హీరో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ... ‘‘బాలగారు అష్టాచమ్మా ముందు నుంచే తెలుసు. ఆయన రెండో సినిమా ‘బ్లైండ్ యాంబిషన్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. నా ఫస్ట్ స్క్రీన్ టైటిల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ శ్రీనివాస్ అవసరాల అని పడింది.
ఆ సినిమాకి శ్రీనివాస్ అవసరాల అని పేరు వేశారు. నాకు ఎప్పటికైనా ఆఫర్ ఇస్తారని ఆశించాను. బాలగారు చేస్తున్న తొలి తెలుగు సినిమాలో నేను లీడ్ క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాతో నిర్మాత ప్రదీప్‌కి లాంగ్ స్టాండింగ్ ఇండస్ట్రీలో ఉండే సక్సెస్ రావడానికి నావంతు కృషి చేస్తానని ప్రామిస్ చేశాను. ఆల్ ది బెస్ట్ ప్రదీప్’’ అన్నారు.
అవసరాల శ్రీనివాస్, మహతి, నాగబాబు, మంచు లక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: యోగేశ్వరశర్మ ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సింధూజ, కాస్ట్యూమ్స్: హర్ష, ఫైట్స్: ఆర్.భరత్‌కుమార్, స్టిల్స్: రఘు, కో-డైరెక్టర్: సూర్య ఎంజమూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా.కిరణ్‌కుమార్, నిర్మాత ప్రదీప్ కె.ఆర్., రచన, దర్శకత్వం: బాల రాజశేఖరుని.