మెగాబ్రదర్ నాగబాబు ఒకప్పుడు పెద్ద మనిషిలా మౌనంగా ఉండేవాడు. కానీ ఈమధ్య ఆయన రాంగోపాల్‌వర్మతో పోటీ పడుతున్నాడు. ఏకంగా ఓ యూట్యూబ్ చానెల్‌ని పెట్టి, బాలకృష్ణపై వరుస వీడియోలతో రెచ్చిపోయాడు. ‘ఎర్రోడి వీరగాథ’ అంటూ షార్ట్‌ఫిల్మ్‌ని కూడా పెట్టాడు. ఆయన తన నోటికి పని చెప్పింది వర్మ, యండమూరిలతోనే. వారిని అక్కుపక్షి అని తిట్టిన నాటి నుంచి జనసేనాధిపతి, తమ్ముడు పవన్‌కి అనుకూలంగా, అన్నయ్య మెగాస్టార్‌పై ఈగ వాలనివ్వకుండా ఎదురుదాడి చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన టిడిపి-వైసీపీలపై సెటైర్లు విసురుతున్నాడు.
ఈయన ఈ విషయంపై తాజాగా మాట్లాడుతూ, నేను జనసేనలో చేరను. కానీ పార్టీ కోసం పనిచేస్తాను. గత పదేళ్ల నుంచి బాలయ్య మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. అన్నయ్యను చూసి ఇంతకాలం ఆగాను. కానీ ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అందుకే ప్రతిదాడికి దిగాను. ఇక కిందటి ఎన్నికల్లో పవన్ టిడిపి ఎందుకు మద్దతు ఇచ్చాడో మీకు తెలియంది కాదు. 2014లో వైసీపీ గాలి బలంగా ఉంది. కానీ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఓ అనుభవంతుడైన నాయకుడు అవసరమని పవన్ చంద్రబాబుకి మద్దతు తెలిపాడు. దీనికి పవన్‌ని ప్యాకేజీస్టార్ అని విమర్శిస్తున్నారు. అలా విమర్శించే వారిని చెప్పుతో కొడుతాను. వాళ్లని ఎలాంటి మాటలు అన్నా తప్పు లేదు అని ఫైర్ అయ్యాడు. ఇలా మెగాబ్రదర్ నాగబాబు బాలయ్యపై తీవ్రంగా మండిపడుతుంటే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం టీఎస్సార్ అవార్డుల వేడుకలో బాలయ్యతో కలిసి స్క్రీన్‌షేర్ చేసుకున్నాడు.
అంతే కాదు.. చిరంజీవి మాట్లాడుతూ, మా మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. మేం మంచి స్నేహితులం. మేము మంచి స్నేహితులం అని తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశం. మా అభిమానులందరు ఎలాంటి బేధాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేందుకు ఇలాంటి కలయిక బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. గతంలో బాలయ్య కూడా తనకి ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో చిరంజీవినే ముందుంటాడు అని చెప్పిన మాటలు తెలిసిందే. మొత్తానికి తమ్ముడు తాట తీస్తుంటే.. అన్నయ్య మాత్రం ఆయింట్‌మెంట్ పూస్తున్నాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి.