నిన్నటి తరం కథానాయికల్ని అమ్మలుగా, అత్తలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ వరుసలో మరో సీనియర్ హీరోయిన్ చాలా కాలం తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. పవన్‌కల్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` సినిమాలో నదియాను అత్తగా చూపించి ఆకట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తరువాత పవన్‌తో చేసిన `అజ్ఞాతవాసి` చిత్రం కోసం చాలా ఏళ్ల తరువాత ఖుష్బూను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి ఏకంగా 90లలో తన గ్లామర్‌తో అప్పటి యువతను ఉర్రూతలూగించిన గ్లామర్ డాల్ నగ్మాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి రాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపించడానికి అప్పుడే కసరత్తులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి గ్లామర్ క్వీన్ నగ్మాను తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.
నగ్మా తెలుగులో సినిమా చేసి దాదాపు 17 ఏళ్లవుతోంది. ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం `నిను చూడక నేనుండలేను`. ఇందులో నగ్మ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఆ తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించని ఆమె భోజ్‌పురి సినిమాల్లో కొన్ని చిత్రాలు చేసి ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తోంది. అలాంటి నగ్మను మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని, అయితే నగ్మా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలిసింది.