గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చాలా చక్కగా కుదిరాడు. కాకపోతే యంగ్ ఎన్టీఆర్ లుక్‌లో బాలయ్య తేలిపోయినా ఆయన నడివయసు పాత్రకి బాలయ్య సరిగ్గా సరిపోయాడు. ఇక కథానాయకుడు సినిమాలో అన్నిటికన్నాఎక్కువగా హైలెట్ అయ్యింది బసవతారకం పాత్రలో మెరిసిన విద్యాబాలన్. ఎన్టీఆర్ భార్య బసవతారకం ప్రజలకు పెద్దగా తెలియని పాత్ర. అసలు బసవతారకం ఇలా ఉంటారని ఏ ఫోటోనో చూచి చెప్పడం తప్ప ఆమెని రియల్‌గా చాలా తక్కువమంది చూసుంటారు. అందుకే కథానాయకుడిలో విద్యాబాలన్‌ని చూసిన వారు బసవతారకం అంటే ఈవిడే అన్నట్టుగా విద్యా నటన, హావభావాలు, ఆహార్యం అన్ని బసవతారకానికి సరిపోలికల్లా కనబడ్డాయి. విద్యాబాలన్ బసవతారకంగా చక్కగా సరిపోయిందని, ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా అన్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇలా తెలుగు డైరెక్ట్ ఫిలింలో నటించి అందరి మన్ననలు పొందింది. ఇక కొన్నిరోజుల వరకు బసవతారకం పేరు చెబితే ప్రేక్షకులకు విద్యాబాలనే గుర్తు రావడం ఖాయం.
ఇక తాజాగా యాత్ర సినిమాలో కూడా మమ్ముట్టి నటనకు, ఆయన వేషధారణకు మంచి కాంప్లిమెంట్స్ పడుతున్నాయి. వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా మమ్ముట్టి సరిగ్గా అతికారు. ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ మమ్ముట్టినే. సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. తన స్వంత స్టైల్ లో చేయడం చాలా ప్లస్ అయ్యింది. చేయి ఊపడం తప్పించి మిగిలిన బాడీ లాంగ్వేజ్ లో మమ్ముట్టే కనిపిస్తాడు కానీ వైఎస్ఆర్ కాదు. ఎమోషనల్ సీన్లలో మమ్ముట్టి చూపించిన ఇంటెన్సిటీ.. ఆ సన్నివేశాల్లో గాఢతను పెంచింది. సినిమా అంతా మమ్ముట్టి షోనే కనిపిస్తుంది. మరి నిజంగానే కొన్ని రోజుల వరకు వైఎస్సార్ అంటే మమ్ముట్టిని గుర్తుకు వచ్చేలా మమ్ముట్టి నటన యాత్రలో కనబడుతుంది.