నేటితరం యంగ్ హీరోలలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం మూసగొట్టుడు పాత్రలతో, హీరోగా ఒక్క చిత్రం హిట్టయితే చాలు.. ఇక తాము హీరోలుగా తప్ప మరే పాత్రలు చేయమని చెప్పి మడిగట్టుకుని కూర్చొనేవారు. అదే బాలీవుడ్, కోలీవుడ్‌లతో పాటు మల్లూవుడ్, శాండల్‌వుడ్‌లలో మాత్రం హీరోలు కూడా విభిన్న పాత్రలు ఒప్పుకునే వారు. మరి అంత మంచి ట్రెండ్ తెలుగులో కూడా ఎప్పుడు వస్తుందా? అని అందరు ఎంతగానో ఎదురు చూశారు. ‘టెంపర్, జైలవకుశ’లలో నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలను ఏకంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేశాడు. అంధునిగా రవితేజ ‘రాజా ది గ్రేట్’లో కనిపించాడు. రానా ‘బాహుబలి’లో భళ్లాలదేవగా మెప్పించాడు. తాజాగా మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ ‘వాల్మీకి’ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడుతోంది.
ఇక విషయానికి వస్తే త్వరలో నేచురల్ స్టార్ నాని ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో తన కెరీర్‌లోనే అత్యధికంగా 50కోట్లకు పైగా బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నాని నాలుగు విభిన్నమైన షేడ్స్ ఉండే ఛాలెంజింగ్ పాత్రని చేస్తున్నాడని సమాచారం. ఆయన సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. సంగీత దర్శకునిగా అనిరుధ్, లేదా అనూప్ రూబెన్స్‌లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది.
ఇక తాజాగా ఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచే ఓ ఆసక్తికర అప్‌డేట్ హాట్‌టాపిక్ అయింది. విక్రమ్ కె.కుమార్ గొప్పతనం ఏమిటంటే.. జయాపజయాలను పక్కనపెడితే ఆయన తన చిత్రంలో హీరోలకే కాదు.. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటారు. ప్రతి పాత్రని అద్భుతంగా డిజైన్ చేసి, చెక్కుతారు. ఇక నాని మూవీలో కూడా ఓ మంచి విలన్, హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర ఉందట. దీనికి ఓ మంచి హ్యాండ్సమ్ నటుడిని తీసుకోవాలని భావించిన విక్రమ్ చివరకు ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయకి ఆ పాత్రను ఆఫర్ చేశాడని తెలుస్తోంది.
విక్రమ్ కె కుమార్ చిత్రం కావడం, మైత్రి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో చిత్రం రూపొందుతూ ఉండటం, నానితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించడంతో కార్తికేయ ఈ పాత్రకు ఓకే చెప్పాడట. ఎందుకంటే గతంలో నాని నటించిన ‘నిన్నుకోరి’ చిత్రం తర్వాత ఆది పినిశెట్టికి ఎంతో పేరు వచ్చింది. ఇక కార్తికేయ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ‘హిప్పీ’ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. మరి కార్తికేయ ఎంట్రీతో నాని-విక్రమ్‌ల చిత్రానికి మరింత నిండుదనం రావడం ఖాయమనే చెప్పాలి.