ఈ మధ్యకాలంలో దక్షిణాది చిత్రాలు అందునా తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. పక్కా మాస్, యాక్షన్ చిత్రాలు, ఇక్కడ ఫ్లాప్ అయిన మూవీలు కూడా హిందీ మూవీ చానెల్స్‌లో, యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందనను రాబడుతున్నాయి. ఇది నిర్మాతలకు కొత్తగా కలిసి వచ్చిన ఆదాయ వనరుగా మారింది. కేవలం నార్త్ ప్రేక్షకుల కోసమే స్పెషల్ యాక్షన్ సీన్స్‌ని జోడించి వదులుతున్నారు. కొందరు డిజిటల్ మీడియా వారు ముంబై నుంచి హైదరాబాద్‌లో మకాం వేసి మరీ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్, రానా వంటి వారు నేషనల్ స్టార్స్ అయిపోయారు.
ఇక అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఈయనకు మలయాళంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఫ్లాప్ చిత్రాలను కూడా అక్కడి జనాలు విపరీతంగా చూస్తూ ఆదరిస్తున్నారు. దీంతో మల్లూవుడ్ స్టార్‌గా అల్లుఅర్జున్ పేరు మారుమోగిపోతోంది. అయితే చిత్రంగా ఇప్పుడు బన్నీకి మహేష్ రూపంలో మంచి పోటీనే ఎదురవుతోంది. అయితే బన్నీ కేరళలో ఫాలోయింగ్ సంపాదించుకుంటే మహేష్ మాత్రం పంజాబీల మనసులు కొల్లగొడుతున్నాడు. ఈ మధ్యకాలంలో పంజాబ్‌లో మహేష్ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆయన నటించిన పాత చిత్రాలు కూడా దుమ్ముదులుపుకుని పంజాబీలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. హిందీ వెర్షన్స్‌ని కూడా పంజాబీలు విపరీతంగా లైక్ చేస్తూ ఉండటం టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్‌కి అక్కడ ఉన్న ఆదరణకు రుజువుగా నిలుస్తోంది.
సోషల్‌మీడియా సర్వేల ప్రకారం మహేష్ చిత్రాలను పంజాబ్‌లో బాగా చూస్తున్నట్లు వెల్లడైంది. పంజాబీ అమ్మాయిలు, అబ్బాయిలు, యూత్ మొత్తం ఆయన చిత్రాలను ‘భళేభళే’ అంటూ ఆస్వాదిస్తున్నారు. ఇక నుంచి మహేష్ చిత్రాలను హిందీ వెర్షన్లోనే కాకుండా పంజాబీలో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉండటం చూస్తుంటే మహేష్ పంజాబీల మనసులను కొల్లగొట్టిన స్టార్‌గా రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనే చెప్పాలి.