ఒక వయసు వచ్చాక.. పెద్దల్ బాధ్యతలను, పిల్లలు స్వీకరించి నిర్వర్తించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ.. పవన్ కళ్యాణ్ కుమారులకు ఇంకా బాధ్యతలు తీసుకొనే వయసు రాకపోవడంతో.. వాళ్ళ బాధ్యతలను సాయిధరమ్ తేజ్ తీసుకొన్నాడనిపిస్తోంది. ఇప్పుడంటే నా జీవితం ప్రజలకే అంకితం అని పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు కానీ.. ఆయన ఆ సడన్ స్టేట్ మెంట్ ఇవ్వకుముందు ఆయనతో సినిమాలు తీసేందుకు కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్ లో మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఏ.ఎం.రత్నం ముందు వరుసలో ఉండగా.. ఇంకో ఇద్దరు నిర్మాతలు కూడా ఉన్నారని తెలుస్తోంది.
అయితే.. పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతల కోసం ఎలాగూ ఇప్పుడు సినిమాలు చేయలేడు కాబట్టి ఆయన స్థానంలో సాయిధరమ్ తేజ్ ఆ అడ్వాన్స్ ల బదులు సినిమాలు ఒప్పుకొంటున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చిత్రాలహరి అనే సినిమా చేస్తున్న సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం ఏ.ఎం.రత్నం బ్యానర్ లో చేయనున్నాడని టాక్. సాయిధరమ్ తేజ్ ఇలా తన చిన్న మావయ్య ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేస్తే తనకు వెండితెరకు పరిచయం చేసినందుకు రుణం తీర్చుకున్నట్లే అవుతుంది.
అయితే.. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సాయిధరమ్ తేజ్ కి అర్జెంట్ గా హిట్ పడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే.. కనీసం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదంటే తేజుని జనాలు హీరోగా గుర్తించడం మానేస్తారు. మరి చిత్రాలహరి రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.