జనవరి అంటే అటు ఇటుగా సంక్రాంతి సీజనే అని అర్ధం. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ఎఫ్ 2’ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పటికీ స్టడీగా రన్ అవుతూ ఉండటంతో భారీ లాభాలతో పాటు నికార్సన అర్ధ శతదినోత్సవం ఖాయం. ఇక ‘కథానాయకుడు, వినయ విధేయ రామ’ చిత్రాల సీన్ అయిపోయింది. నందమూరి, మెగా వారసులు పోటీ పడి ఇద్దరు కుదేలయ్యారు. అయితే ఈ రెండింటికి ఒక్కో గాథ, విమర్శకుల ప్రశంసలు, పాజిటివ్ రివ్యూలు, టాక్ సొంతం చేసుకున్న ‘కథానాయకుడు’ 70కోట్లకు గాను 20కోట్లతో మాత్రమే సరిపెట్టుకుని టాలీవుడ్‌లో ‘అజ్ఞాతవాసి, స్పైడర్’ ల తర్వాత భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
మరోవైపు చెత్త రేటింగ్‌లు, బ్యాడ్‌టాక్, ప్రేక్షకులకు పిచ్చిపట్టించిన ‘వినయ విధేయ రామ’ మాత్రం ఏకంగా 50కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. మొత్తానికి ఈ రెండు భారీ నష్టాలనే మిగిల్చాయి. అలా నందమూరి, మెగా హీరోలిద్దరు సంక్రాంతికి నిరాశపరిచారు. ఇక విషయానికి వస్తే ఫిబ్రవరి సాధారణంగా సినీ మేకర్స్‌కి బ్యాడ్‌సీజన్. దాంతో ఈ నెల విడుదల కానున్న వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సెమీ బయోపిక్ ‘యాత్ర’పై మాత్రమే కాస్త ఆశలున్నాయి. మిగిలిన నెల అంతా ‘మహానాయకుడు’ గానీ రాకపోతే డ్రైగా సాగిపోనుంది.
ఇక మార్చి 1వ తేదీన మొదటి రోజే అటు నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ నటించిన అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’ విడుదల కానుంది. నివేదాథామస్, ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ షాలినీపాండే నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ బాగానే ఉంది. ఇక అదే రోజున అల్లువారి చిన్నబ్బాయ్ అల్లుశిరీష్ ‘ఎబిసిడి’గా రానున్నాడు. ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి రీమేక్ కావడంతో దీనిని సేఫ్ ప్రాజెక్ట్‌గానే అందరు భావిస్తున్నారు. తనకి తగిన పాత్రను, కథను ఈ చిత్రం ద్వారా అల్లుశిరీష్ ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది.
మరోవైపు నందమూరి వారసుల్లో కళ్యాణ్‌రామ్‌ది పెద్దగా విజయాలు లేని సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ పరిస్థితి కూడా అదే. దాంతో ఇద్దరు సమాన స్థాయి కలిగిన ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న చిత్రాలు ఒకే రోజున విడుదల కానుండటంతో వీటిలో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో వేచిచూడాలి! మరి సంక్రాంతి పోటీలానే నందమూరి, మెగాహీరోలిద్దరు నిరాశపరుస్తారా? లేదా సరైన హిట్స్ సాధిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది..!