దిల్ నుంచి కొత్త బంగారు లోకం వరకు దిల్ రాజుకు ఎదురేలేదు. వరుసగా ఏడు విజయాల్ని సొంతం చేసుకున్న ఆయన పరుగు ఆ తరువాత నుంచే నత్తనడకన సాగడం మొదలుపెట్టింది. ఇండస్ట్రీలో ఇటు నిర్మాతగా, అటు డిస్ట్రిబ్యూటర్‌గా రెండు పడవల ప్రయాణాన్ని సునాయాసంగా చేస్తూ తనకు ఏరంగంలోనూ తిరుగులేదనిపించుకున్నారు. లక్కీయెస్ట్ ప్రొడ్యూసర్‌గా పేరుతెచ్చుకున్న దిల్‌రాజు గత కొంత కాలంగా ఇటు నిర్మాతగా, అటు డిస్ట్రిబ్యూటర్‌గానూ వరుస వైఫల్యాల్ని చవిచూస్తున్నారు.
నిర్మాతగా మంచి జడ్జిమెంట్ వున్నా గత ఏడాది లవర్, శ్రీనివాస కల్యాణం, హలో గురు ప్రేమకోసమే చిత్రాలకు భారీగానే పోగొట్టుకున్న ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా అంతకు మించి పోగొట్టుకున్నారు. జాగ్రత్త పడకపోతే మొదటికే మోసం అయ్యేలా వుందని గ్రహించిన ఆయన ఈ సంక్రాంతికి సేఫ్‌గా బయటపడాలని డబుల్ గేమ్ మొదలుపెట్టారు. దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం `ఎఫ్2`. వెంకటేష్, వరుణ్‌తేజ్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద పెద్దగా అంచనాలు లేవు. అసలు ఈ సినిమాకు బజే లేదు.
దీన్ని గ్రహించిన దిల్ రాజు రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ఊరమాస్ మూవీ `వినయ విధేయ రామ` నైజామ్‌తో పాటు వైజాగ్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఈ నెల 11న వస్తోంది. `ఎఫ్2`తో పోయేది ఆయన లెక్క ప్రకారం `వినయ విధేయ రామ`తో కవర్ అవుతుంది. ఒక వేళ `వినయ విధేయ రామ`తో పోయేది `ఎఫ్2` కవర్ చేస్తుంది. ఇలా లెక్కలేసుకుని మరీ దిల్‌రాజు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో, లేక ఉన్నది ఊడ్చేస్తుందో తెలియాలంటే ఈ సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.