ఎన్నికల సీజన్ వచ్చింది. ఇక దీనితో పలు చిత్రాలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా స్వయంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌గా ‘కథానాయకుడు, మహానాయకుడు’ తీస్తున్నాడు. ఇది తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని తీస్తున్నాడు. ఇందులో చంద్రబాబునాయుడుతో పాటు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం నాయకులను కాస్త నెగటివ్‌గా చూపించే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ శ్రేణులు ఈ చిత్రంపై కూడా ముచ్చటపడుతూ తమ వంతుగా బాగానే ప్రమోషన్ చేసుకుంటున్నారు.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా తీస్తున్న ‘యాత్ర’ కూడా వైసీపి నాయకులకు సంతోషాన్ని కలిగించే విషయమే. ఇప్పుడు తాజాగా వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న సంచలన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయ నేపధ్యంలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. గత కొంతకాలంగా రచయితకు, దర్శకునిగా విరామం ఇచ్చిన పోసాని మరోసారి తన ఆపరేషన్‌ని మొదలుపెట్టనున్నాడు. ఇందులో ఏపీ ప్రస్తుత రాజకీయాలపై పలు వ్యంగ్యాస్త్రాలు ఉంటాయని తెలుస్తోంది.
రాంగోపాల్‌వర్మ మైండ్ సెట్ ఎలాంటిదో పోసానిది కూడా దాదాపు అదే టైప్. తాననుకున్నది చేసి చూపించేదాకా నిద్రపోడు. ఆవేశం పాలు ఎక్కువ. ‘శ్రావణమాసం, మెంటల్‌కృష్ణ’ వంటి పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించినా బాగా హిట్టయిన చిత్రం మాత్రం శ్రీకాంత్ హీరోగా ముమైత్‌ఖాన్ ప్రధానపాత్రలో ఆయన తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’.
ఇక తాజాగా ఆయన చేయాలనుకుంటున్న సినిమాలో ఆయన టిడిపిని, చంద్రబాబుని ఏకిపారేసి జగన్‌కి అనుకూలంగా మూవీని తీస్తాడని దాదాపు అందరు ఫిక్స్ అయిపోతున్నారు. మరి పోసాని ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి మ్యాజిక్‌ని మరలా రిపీట్ చేయగలడా? దర్శకునిగా, రచయితగా తనకి అచ్చి వచ్చిన రాజకీయ సెటైరికల్ మూవీని విజయపధంలో నడిపించి, తటస్థ ఓటర్లను వైసీపీ వైపు ఎంత వరకు మళ్లించగలడు? అనేవి వేచిచూడాల్సివుంది...!