`బాహుబలి` సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అతని నుంచి సినిమా వస్తోందంటే యావత్ భారతం ఎదురుచూస్తోంది. అలాంటి ప్రభాస్‌కు తెలంగాణ గవర్నమెంట్ గట్టి షాకిచ్చింది. రాయదుర్గంలోని ప్రభాస్ గెస్ట్‌హౌజ్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇది తెలుగు సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. అవన్నీ తాజాగా పరిష్కరం కావడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలాన్ని సీజ్ చేసి తమ ఆధానంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అదే స్థలంలో హీరో ప్రభాస్‌కు సంబంధించిన గెస్ట్‌హౌజ్ కూడా వుండటంతో రెవెన్యూ అధికారులు దాన్ని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ దఫా ఎవరు అవినీతికి పాల్పడినా వదిలే ప్రసక్తి లేదంటూ సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఈ సంఘటన ద్వారా నిజమయ్యాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ గెస్ట్‌హౌజ్ వున్న స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య వీరి వాదనలు విన్న న్యాయస్థానం వీరికే అనుకూలంగా తీర్పును వెలువరించింది.
రాయదుర్గంలోని పైగా గ్రామానికి చెందిన భూమిని లబ్దిదారుల పేర్లపై పట్టా చేయాలని కోర్టు గతంలో ఆదేశించినా అప్పటి తహసీల్దారు స్పందించకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో శివరామకృష్ణ అనే వ్యక్తి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం సదరు తహసీల్దారుపై కోర్టు ధిక్కారణ కింద శిక్ష విధించింది. అయితే ఆయన పై కోర్టుని ఆశ్రయించి బలంగా వాదనలు వినిపించడంతో అతని వాదనను బలపరుస్తూ ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. దీని కారణంగానే వివాదాస్పద స్థలంలో వున్న హీరో ప్రభాస్ గెస్ట్‌హౌజ్ ని అధికారులు సీజ్ చేశారని తెలిసింది.