హెడ్డింగ్ చూసి దేవిశ్రీప్రసాద్ కనిపించడం లేదనో లేక ఆయన్ని ఎవరైనా కిడ్నాప్ చేసారనో ఫిక్స్ అయిపోకండి. ఇక్కడ కనిపించకుండాపోయింది ప్రేక్షకుల్ని తన పాటలతో మెస్మరైజ్ చేసే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్ ను శ్రోతలు బాగా మిస్ అవుతున్నారు. అప్పటివరకూ తన డప్పుల గోలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన తమన్ కూడా ఇప్పుడు సరికొత్త ట్యూన్స్ మరియు రోమాంటిక్ నెంబర్స్ తో ఆకట్టుకుంటుంటే.. దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇంకా తన ట్యూన్స్ తానే కాపీ కొట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు. తనకు బాగా ఇష్టమైన సుకుమార్ కోసం చేసిన రంగస్థలం చిత్రానికి తప్ప ఈమధ్యకాలంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హిట్టైన ఆల్బమ్ ఒక్కటి కూడా లేదు.
ఒకప్పుడు ఆల్బమ్ లో కనీసం నాలుగైదు ఇన్స్టాంట్ హిట్స్ తో ఆకట్టుకున్న దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో వస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు పాటల్లో ఏ ఒక్కటీ ఆకట్టుకునే స్థాయి కాదు కదా కనీసం వినదగ్గ విధంగా కూడా లేదు. దాంతో ఒకప్పుడు దేవి పాటలకు విపరీతమైన అభిమానులందరూ దారుణంగా హర్ట్ అవ్వడమే కాక.. మాకు వింటేజ్ దేవిశ్రీప్రసాద్ కావాలి అని సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలెట్టారు.
నిజమేలే.. ఒకప్పుడు సొంతం, పౌర్ణమి, జులాయి లాంటి సినిమాకు దేవి అందించిన సంగీతం వింటే.. ఇప్పుడు మనోడు చేసే ట్యూన్స్ ఆయన వీరాభిమానులకు కూడా నచ్చవు. ఇక వినయ విధేయ రామ ఆల్బమ్ లోని ట్యూన్స్ అన్నీ కూడా అలాగే ఉంటే ఫ్లాప్ ఆల్బమ్ కిందే లెక్కలోకి వచ్చేస్తుంది.