సినిమా మొత్తం పైరసీ అయింది. ఇప్పటికే చాలా మంది చూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా టాక్సీవాలాను విడుదల చేసిన నిర్మాతలకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఒకానొక సందర్భంలో టాక్సీవాలా ఇక విడుదల లేదు. వెబ్ సిరీస్‌గా మాత్రమే విడుదల అవుతుందనే వార్తలు కూడా వినిపించాయి. నిజంగా అలా జరిగి ఉంటే గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, విజయ్ దేవరకొండల పరువు పోయి ఉండేది. ఎందుకంటే అంత పెద్ద సంస్థలలో రూపుదిద్దుకుని థియేటర్లలో కాకుండా.. వెబ్ సిరీస్‌గా వస్తే.. నిజంగా అది అవమానకరమే. ఇది గమనించేనేమో నిర్మాతలు ధైర్యంగా విడుదల చేశారు.
ఇక విషయంలోకి వస్తే.. ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. విడుదలను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులందరూ ఈ చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కోలీవుడ్ నుంచి సూర్య కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపాడు. ఇక టాలీవుడ్‌లో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిఖిల్.. ఇలా అందరూ పైరసీని ఎంకరేజ్ చేయవద్దు.. ఈ సినిమాని థియేటర్లలో చూసి టీమ్‌ని ఆశీర్వదించండని.. తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ సినిమా విడుదలై మంచి టాక్‌నే సొంత చేసుకుంది. విజయ్ దేవరకొండ హీరో కాబట్టి.. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే ఉంటాయి. ఇక మెగా హీరోల సపోర్ట్‌తో పాటు, బాహుబలి సపోర్ట్ కూడా ఎలాగూ సినిమాకి ఉంది కాబట్టి.. వారి అభిమానులు ఈ సినిమాని సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చేయడం తధ్యం.