రాజమౌళి ఏది చేసినా... స్పెషలే. దర్శకధీరుడు సినిమా సెట్ చేసి సెట్స్ మీదకెళ్ళాడు అంటే... ఆ సినిమా మీద భారీ అనడం కంటే... బహు భారీ అంచనాలు ఏర్పడిపోతాయి. మామూలుగానే రాజమౌళి సినిమాలకు బోలెడంత క్రేజు. ఇప్పుడు ఎన్టీఆర్ - చరణ్ లు కలిసి మల్టీస్టారర్ చెయ్యడం మరో ఎత్తు. మరి రాజమౌళి, రామ్ చరణ్, రామారావు కలిస్తే బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయమే. ఇప్పుడు తాజాగా ఆ ముగ్గురి కాంబోలో RRR పట్టాలెక్కేసింది. మరో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లబోతుంది. మొదటగా RRR షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.
మరి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి కనబడడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఆ సినిమా మీద అన్ని అంచనాలు. ఇక రాజమౌళి తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. భారత దేశం గర్వించే సినిమా బాహుబలిలో రాజమౌళి కిలికిలి అనే భాషను పరిచయం చేశాడు. మరి ఆ కిలికిలి భాష అనేది ఇప్పటికి ఫన్నీగా చాలామంది చాలా సందర్భాల్లో వాడుతూ తెగ ఫేమస్ అయ్యింది. మరి రాజమౌళి ఇప్పుడు RRR లో కూడా ఒక కొత్త భాషను చూపెట్టబోతున్నాడట. బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ రైటర్ కూడా ఉన్నాడు. తమిళ రైటర్ కార్కీ కూడా RRR కు డైలాగ్స్ ని అందిస్తున్నాడు.
అయితే ఈ తమిళ రచయితతోనే రాజమౌళి ఒక కొత్త భాషను రాయించబోతున్నాడట. కిలికిలి భాష కోసం రాజమౌళి అండ్ టీం ఎలాంటి కసరత్తులు చేశారో.. ఇప్పుడు RRR లో కూడా ఒక కొత్త భాష పుట్టిస్తారని సమాచారం. అయితే ఆ కొత్త భాషను ఈసారి ఎన్టీఆర్ నోటి ద్వారా మనం వినబోతున్నామనేది లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్. మరి ఎన్టీఆర్ నోటివెంట ఎలాంటి భాష వినబోతున్నామో అంటూ అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఇదై పోతున్నారు. మరి కార్కీ ఎలాంటి భాషను పరిచయం చేస్తాడో కానీ... ఎన్టీఆర్ నోటి వెంట ఆ కొత్త భాష వినడమంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ అయ్యుంటాడు అనే అనుమానం బలపడుతుంది అని అంటున్నారు. విలన్ గానే ఎన్టీఆర్ ఆ కొత్త భాషను ఉచ్ఛరిస్తాడని అంటున్నారు. చూద్దాం ఎన్టీఆర్ విలన్ అవునా?... రామ్ చరణ్ హీరోనా అనేది.