‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం ద్వారా సంచలన హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఈయన ‘దేవదాస్’ చిత్రం విడుదల సందర్భంగా నాగార్జున చొక్కాలేని సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించే ఫొటోని పోస్ట్ చేసి నాగార్జున వికీపీడియా ఆయన వయసుని ఏమైనా తప్పుగా చూపిస్తోందా? అని కామెంట్స్ పెట్టి మాలాంటి కొత్త హీరోలకు నాగార్జున చాలెంజ్ విసురుతున్నాడని పోస్ట్ పెట్టాడు. ఇక తాజాగా ఆయన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా దీపావళికి విడుదలైన మురుగదాస్-విజయ్‌ల ‘సర్కార్’ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇటీవలే ‘2.ఓ’ ట్రైలర్‌ని ఆకాశానికి ఎత్తేసిన మహేష్ తాజాగా ‘సర్కార్’ చిత్రంపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ చిత్రం అద్భుతంగా ఉందని మహేష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో ఏ.ఆర్.మురుగదాస్ మార్క్ కనిపించింది... అని మహేష్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక మహేష్ విషయానికి వస్తే ఆయన కేవలం ‘సర్కార్’ చిత్రంపైనే కాదు.. ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఏ చిత్రం వచ్చినా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించి, ఆయా చిత్రాలకు ప్రమోషన్స్‌పరంగా కూడా తన వంతు సాయం అందిస్తుంటాడు. ఇదే విషయాన్ని ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ తెలిపాడు. ఇంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా మహేష్ ఇతర చిత్రాలపై, ఇతర హీరోల మూవీస్‌కి కూడా తనవంతు సహకారం అందించడం గొప్ప విషయమని కార్తికేయ అభిప్రాయపడ్డాడు.
ఆయన మాట్లాడుతూ, సూపర్‌స్టార్ అంటే కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్ వంటి వారు చూపించే యాటిట్యూడ్ కూడా. ఆయన మురుగదాస్ దర్శకత్వంలో నటించిన ‘స్పైడర్’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయినా ఎ.ఆర్.మురుగదాస్ పట్ల మహేష్ గారికి ఉన్న నమ్మకం మాత్రం తగ్గలేదు. ఆయనపై మహేష్ సర్‌కి ఇప్పటికీ అదే గౌరవం ఉంది. మరో మంచి విషయం ఏమిటంటే.. మహేష్ వంటి స్టార్ మరో స్టార్ అయిన విజయ్ నటించిన చిత్రానికి ప్రమోషన్ కల్పించడం అనేది ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ సాధ్యం కాదు.. అని కార్తికేయ ట్వీట్ చేశాడు. ‘ఆర్‌ఎక్స్ 100’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తికేయ తాజాగా ‘హిప్పీ’ అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తూ ఉన్నాడు. ఈ మూవీ మరో విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతూ ఉండటం విశేషం.