మనదేశం పేరుకే ప్రజాస్వామ్యం. ఇక్కడ కేవలం అధికారం, ఉన్నతపదవుల్లో ఉన్నవారు చెప్పిందే నడిచే విచిత్రమైన ప్రజాస్వామ్యం. నేడు ప్రతి వ్యవస్థ కూడా ప్రభుత్వం, అధికారం ఉన్న వారి గుప్పిట్లో ఉంటోంది. వారు చెప్పినట్లే పేరుకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఒకనాడు సిబిఐ అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ తాజాగా సిబిఐలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూసి ఏకంగా ఓ మాజీ సిబిఐ ఉన్నతాధికారి తాను సిబిఐలో పనిచేశానని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నానని చెప్పాడు. న్యాయవ్యవస్థ, ఆర్‌బిఐ, సిబిఐ, సిబిసిఐడి, పోలీసులు, ఎన్నికల కమిషన్ ఇలా అన్ని సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇక మీడియా గురించి మాట్లాడటమే అనవసరం. ఒకనాడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పిలిస్తే, నేటి సిబిఐని మోదీ చేత కంట్రోల్డ్ బ్యూరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా పిలవాల్సిన దుస్థితి.
ఇక బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలోని మేధావుల అభిప్రాయాలను కూడా సెన్సార్ పేరుతో నానా ఇబ్బందులు పెట్టి ప్రజలను ఆలోచింపజేసే చిత్రాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అసలు సెన్సార్ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారు? వారికి సినిమాలపై ఉన్న అవగాహన ఎంత? అనేవి ‘పద్మావత్, మెర్సల్’ వంటి చిత్రాల విషయంలోనే అర్ధమైంది. ఇక తాజాగా సెన్సార్‌బోర్డ్ మాజీ చీఫ్‌గా పనిచేసిన పహ్లాజ్ నిహ్లనినే సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఆ సెగ ఆయననే తాకిందంటే పరిస్థితి అర్ధమవుతోంది. పహ్లాజ్ నిహ్లానీ దర్శకత్వం వహించిన ‘రంగీలా రాజా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏకంగా 20 కట్స్ చెప్పింది. దాంతో ఆగ్రహించిన ఆయన దీనిపై ముంబై హైకోర్టుకి వెళ్లారు. సెన్సార్‌బోర్డ్ చీఫ్ ప్రసూన్‌జోషిపై పిటిషన్ వేశాడు. పాత వైరాలను మదిలో పెట్టుకునే ప్రసూన్‌జోషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా నాపై కక్ష్యసాధిస్తున్నారు. నా సినిమాని సెన్సార్‌బోర్డ్‌కి పంపితే ఈ విధంగా వారు నాపై కసి తీర్చుకుంటున్నారు. కానీ నేను పోరాడకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రస్తుత సిబీఎఫ్‌సి చీఫ్ ప్రసూన్‌జోషికి అమీర్‌ఖాన్‌తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కాబట్టే ఆయన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’కి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ నేను తెరకెక్కించిన ‘రంగీలా రాజా’ చిత్రాన్ని సెన్సార్‌కి సరైన సమయానికి పంపినా ఏకంగా 20కట్స్ ఇచ్చారు. కానీ నేను మాత్రం కట్స్ విధించిన సన్నివేశాలను తొలగించే ప్రసక్తే లేదు. దీనిపై పోరాటానికి ఎంతదూరమైనా వెళతా..’’ అని చెప్పుకొచ్చాడు. మరి ఈయన పోరాటం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది..!