RRR పై ఇప్పటివరకు వచ్చిన గాసిప్స్ ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు! రాజమౌళి.. ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ ని డివివి దానయ్య నిర్మాణంలో ఎనౌన్స్ చేసి అందరిలో అమితమైన ఆసక్తిని రేకెత్తించాడు. రాజమౌళి కున్న ట్రాక్ రికార్డుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ పై సినిమా మొదలుపెట్టకముందే ఆకాశాన్ని తాకే అంచనాలు మొదలైనాయి. అలాగే రాజమౌళి ఈ సినిమా విషయమై ఎక్కడా పెదవి విప్పకపోయినా.. మీడియా మాత్రం RRR పై రకరకాల వార్తలు వండి వారుస్తుంది. రోజుకో పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్ల యోధులుగా కనబడతారని ఒకసారి.. కాదు కాదు 1980 లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంటూ అబ్బో చాలా రకాల వార్తలే చక్కర్లు కొట్టాయి.
తాజాగా RRR పై వినబడుతున్న వార్త చదివితే అటు ఎన్టీఆర్ అభిమానులకు, ఇటు మెగా అభిమానుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కేరెక్టర్లపై ఒక ఆసక్తికర విషయం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఆవార్త మాత్రం అందరిని షేక్ చేసి పారేస్తోంది. అదేమిటంటే... RRRలో ఎన్టీఆర్ ని ప్రతినాయకుడిగా అదేనండి విలన్ గా చూపించబోతున్నాడట రాజమౌళి. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల మధ్య పోరు.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. RRR సినిమా కాన్సెప్ట్ అంతా వీరిద్దరి వైరం మీదే ఉండబోతుందనేది లేటెస్ట్ టాక్.
మరి బాహుబలిలో రానా విలన్ గా ప్రభాస్ ని హీరోగా చూపించినప్పటికీ.. రానా, ప్రభాస్ కేరెక్టర్స్ ని ఎక్కడా తగ్గకుండా రాజమౌళి మేనేజ్ చేసాడు. అలాగే ఇప్పుడు RRRలో కూడా ఎన్టీఆర్ విలన్ గా, రామ్ చరణ్ హీరోగా చూపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడు గా చూపించనున్న ఎన్టీఆర్ ని హీరో కంటే కాస్త ఎక్కువ పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడట. విలన్, హీరో మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తులాంటి పోరే.. ఈ సినిమా అంటున్నారు. మరి రాజమౌళి జై లవకుశలో ఎన్టీఆర్ చేసిన జై కేరెక్టర్ ని చూసాక... RRR లో ఖచ్చితంగా అలాంటి పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలోనే చూపించాలని డిసైడ్ అయ్యాడట. అందుకే తన సినిమాలో ఎన్టీఆర్ ని ప్రతినాయకుడిగాను, రామ్ చరణ్ ని కథానాయకుడిగా చూపించడానికి రెడీ అవుతున్నాడట. ఇక ఈ బడా మల్టీస్టారర్ నవంబర్ 18న పట్టాలెక్కేందుకు రెడీ అవుతుందని సమాచారం.