ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమంతో దేశం హోరెత్తుతోంది. ఇందులో బయటపడుతున్న సినీ ప్రముఖులు, బాధితుల పేర్లు అందరినీ షాక్‌కి గురి చేసేలా ఉన్నాయి. మిగతా అందరి విషయంలో ఏమో చెప్పలేం గానీ వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను మాత్రం తమిళ పరిశ్రమ కక్కలేక మింగలేకపోతోంది. ఆమె చెప్పినదాంట్లో వాస్తవాలు కఠినంగా ఉన్నా సరే.. అవి నిజమేనని పలువురు నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకి పలువురు ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సుచీ తర్వాత అంతటి సంచలనాలకు చిన్మయి కారణమైంది. తనుశ్రీదత్తా, శ్రీరెడ్డి, కంగనారౌనత్ వంటి వారిపై కాస్త అనుమానపు చూపులున్నా కూడా ఈమె విషయంలో మాత్రం అందరు ఆమె చెప్పిందే నిజమేననే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తపరుస్తున్నారు.
ఇక తాజాగా ఈమెకి, ఆమె చెప్పే విషయాలను జనాలు ఎంతగా ఆసక్తిగా వినాలని భావిస్తున్నారో అనే దానికి ఒక విషయం ఉదాహరణగా నిలుస్తోంది. ఈమె ప్రముఖ తమిళ పత్రిక దినతంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా, అది సంచలనాలను క్రియేట్ చేస్తోంది. దీనిని 24గంటల వ్యవధిలోనే 15లక్షలకు మందిపైగా వీక్షించారు. ఆమె ఇంటర్వ్యూ 24గంటల పాటు టాప్‌ట్రెండింగ్‌లో మూడోస్థానంలో నిలవడం విశేషం. గతంలో కమల్‌హాసన్ ఇంటర్వ్యూని ఒక రోజులో 10లక్షల మంది వీక్షించారు. ఆ రికార్డును చిన్మయి అధిగమించింది. ఇక ఇదే ‘దినతంత్రి’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నటుడు శివకార్తికేయన్ వంటి పలువురిని ఇంటర్వ్యూ చేసిన చిన్మయిశ్రీపాదకి వచ్చిన రెస్సాన్స్ మాత్రం వారికి రాలేదు. వారి కంటే చిన్మయి ఇంటర్వ్యూని తెలుసుకోవడానికి అందరు ఆసక్తి చూపుతూ ఉండటం విశేషం.