రామ్‌చరణ్... తన కెరీర్‌లో రెండో చిత్రమే రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చేసి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు చేశాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన చేసిన 'ఆరెంజ్' నటునిగా ఆయనకు వైవిధ్యచిత్రమే గానీ దర్శకుని తలాతోక లేని కథ, కథనాలు వల్ల డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఈయన మూస చిత్రాలు చేస్తూ వచ్చాడు. ఇవి కమర్షియల్‌గా ఓకే అయినా గానీ ఆయనలోని నటుడిని ఏమాత్రం బయటకు తేలేకపోయాయి. అలాంటి సమయంలో 'తని ఒరువన్'ని రీమేక్‌గా 'ధృవ' చేశాడు. ఆ తర్వాత చేసిన 'రంగస్థలం' గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా తనలోని సంపూర్ణ నటుడిని ఆయన ఆవిష్కరించుకున్నాడు. ఇక తాజాగా ఆయన బోయపాటి శ్రీను వంటి పవర్‌ఫుల్ డైరెక్టర్‌తో దానయ్య నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో, ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రాలను తీస్తూనే అందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా జొప్పించి పండించడంలో బోయపాటి శ్రీను కంటూ ఓ ప్రత్యేకశైలి ఉంది.
రెండు విరుద్దమైన వైవిధ్యభరిత కథలు, పాత్రల ద్వారా మెప్పించిన చరణ్‌కి ఇది పక్కామాస్, యాక్షన్ చిత్రం అయినా సరే.. ఇది కూడా వైవిధ్యమైనదేనని చెప్పాలి. అందునా రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చేయడానికి ముందు వచ్చే ఈ చిత్రం విజయం అత్యంత కీలకం. మరోవైపు ఈ మల్టీస్టారర్‌కి ముందు ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం ద్వారా పెద్ద హిట్‌ని ఖాతాలో వేసుకున్న సమయంలో చరణ్‌కి కూడా ఆ స్థాయి హిట్ వస్తుందని మెగాభిమానులు నమ్మకంగా ఉన్నారు. స్వతహాగా స్పీడ్‌గా చిత్రాలు తీసే బోయపాటి ఈ చిత్రాన్ని జక్కన్న తరహాలో నెమ్మదిగా చెక్కుతూ, ఎక్కడా రాజీపడకుండా తీస్తున్నాడని తెలుస్తోంది. కొంత కాలం కిందట ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టేట్‌రౌడీ' అనే టైటిల్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వల్ల ఎన్ని ప్లస్సులు ఉంటాయో అంత మైనస్‌లు కూడా ఉంటాయని భావించారు కాబోలు దీనికి 'వినయ విధేయ రామా' అనే కాస్త పొయిటిక్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి. 'అరవింద సమేత వీరరాఘవ' టైప్‌లోనే ఈ టైటిల్ కూడా స్లో పాయిజన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించడం ఖాయమేనని చెప్పాలి.
'జయజానకి నాయకా' తర్వాత మరో సాఫ్ట్ టైటిల్‌తో బోయపాటి రానుండటం విశేషం. ఇక ఇందులో అన్నావదిన, మరిది వంటి ఎమోషన్స్‌కి కూడా కొదువలేదని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ లోగోలు, ఫస్ట్‌లుక్‌లు దసరాకి వస్తాయని అందరు భావించారు. కానీ అభిమానులకు నిరాశే మిగిలింది. మొత్తానికి వీటిని దీపావళి కానుకగా విడుదల చేస్తారని తెలుస్తోంది. సినిమాని సంక్రాంతి బరిలో దింపనున్నారు. ఆల్‌రెడీ సంక్రాంతి మొనగాడుగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌తో ఈ 'వినయ విధేయ రామా' పోటీ పడనుంది. మరి సంక్రాంతి విజేతగా నిలిచేది ఎవరో వేచిచూడాలి....!