మొత్తానికి తిత్లీ తుపాన్ వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు జరిగిన అపారనష్టం పూడ్చేందుకు టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వస్తోంది. కేంద్రం నుంచి ఎవ్వరూ పెద్దగా సాయం ఆశించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే మోదీ నైజం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు స్పందించాడు. తన స్థాయి కంటే మిన్నగా 50వేలు సీఎం నిధికి అందించాడు. ఆ వెంటనే విజయ్‌దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, బాలయ్యలు కూడా తమ వంతు సాయం చేశారు.
ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు జనసైనికులు, మెగాభిమానులు తుపాన్ బాధిత ప్రాంతాలలో సహాయకచర్యలు చేపట్టారు. ఎందుకంటే ఈరోజుల్లో ప్రకటించిన సాయం కూడా ప్రభుత్వం, అధికారుల నుంచి పూర్తిగా బాధితులకు అందుతుందనే గ్యారంటీ లేదు. మధ్యలో స్వాహా చేసే ప్రబుద్దులు, బాధితుల మీద కనీస మానవత్వం లేని, ప్రతి దానిలో కమీషన్‌కి అలవాటు పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక తాజాగా అల్లుఅర్జున్ 25లక్షల సాయం ప్రకటించాడు. మరోవైపు పవన్‌కళ్యాణ్ రామ్‌చరణ్‌కి ఓ సూచన చేశాడు. తుపాన్ వల్ల ఏదైనా బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఎందుకంటే దీని వల్ల మధ్య దళారులు లేకుండా బాధితులకు నిజమైన సాయం అందుతుది.
దానికి అబ్బాయ్ కూడా వెంటనే స్పందించాడు. తక్షణమే కార్యరంగంలోకి దిగిపోయారు. తన సేవలు ఏ గ్రామానికి అవసరమవుతాయో దానిని గుర్తించమని తన టీంని ఆదేశించాడు. వారు గ్రామాన్ని సూచించిన తర్వాత చరణ్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని మరలా పునరుద్దరించేందుకు సిద్దమని తెలిపి, త్వరలోనే ఆ గ్రామాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడు. మొత్తానికి చరణ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. బన్నీ కూడా డబ్బులుగా కాకుండా ఇదే తరహాలోనే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని మెగాభిమానులు భావిస్తుండటం విశేషం.