జనసేనాధిపతి పవన్‌లో ఆవేశంతో పాటు అన్ని విభిన్నంగానే ఉంటాయి. వేషధారణ నుంచి హావభావాలు, మాటలు, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. లాల్చీపైజమా, జీన్స్, కుర్తా, ప్యాంట్ షర్ట్, మరోసారి పంచెకట్టుతో కనిపిస్తూ ఉంటాడు. గతంలో వైఎస్, రోశయ్య, వెంకయ్యనాయుడు వంటి వారు పంచెకట్టుతో కనిపించే వారు. అసలైన తెలుగువాడి పంచెకట్టు అంటే తనకెంతో ఇష్టమని అందుకే తాను పంచె ధరిస్తానని పవన్ చెబుతూ ఉంటాడు. ఇక విషయానికి వస్తే పవన్ మరోసారి ఆవేశభరిత ప్రసంగం చేశారు.
ఆయన మాట్లాడుతూ, జనసేన కవాత్తు బల ప్రదర్శన కాదు. ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేసే ఓ కార్యక్రమం. దాదాపు 10లక్షల మంది ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జ్‌పై కవాత్తు నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. నిజంగా బలప్రదర్శన చేయాలంటే పరిస్థితి మరోలా ఉంటుంది. అప్పుడు శత్రువైనా మిగులుతాడు.. లేదంటే నేనైనా మిగులుతాను. జనసైనికులు నన్ను చూడటానికో , బిర్యానీ పొట్లాల కోసమో, సారా ప్యాకెట్ కోసమో ఆశ పడి రాలేదు. దోపిడీ ప్రభుత్వాలను హెచ్చరించడానికే వచ్చారు.
ప్రతిపక్ష నేత జగన్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఏదో చేస్తానని చెబితే ఎలా వీలవుతుంది? అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై గళమెత్తాల్సిన బాధ్యత ఆయనపై లేదా? రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సర్ ఆర్దర్‌కాటన్ మాదిరి ఉన్నత ఆశయం కోసం ధవళేశ్వరం ఆనకట్ట కట్టారు. చంద్రబాబు కూడా మంచి ఆశయం కోసం పోలవరం కట్టాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.