చాలామంది అపజయాలలో ఉన్నప్పుడు కాస్త టెన్షన్ పడుతుంటారు. కానీ అంతకంటే ప్రమాదం వరుస విజయాలు. వాటిని నెత్తికెక్కించుకుంటే ఘోరపరాభవాలు తప్పదు. ఈ విషయం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎందరి కెరీర్స్‌లోనో నిజమైంది. మెగాస్టార్ వంటి వ్యక్తి కూడా ఒకానొక సమయంలోఇండస్ట్రీలో వరుస చిత్రాలు చేస్తున్న సమయంలోనే ఎంతోకాలం మేకప్ వేసుకోలేదు. ఇక నేటి యంగ్ హీరోల విషయానికి వస్తే వరుసగా రెండు బ్లాక్‌బస్టర్స్ వస్తే చాలు తమ జడ్జిమెంట్‌పైనే కాదు... రెమ్యూనరేషన్స్ వంటి విషయాలలో కూడా లెక్కలేని తనంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇక తనదైన యూటిట్యూడ్‌తో నిత్యం తనదైన శైలిలో ఉండాలనే బాపత్తు హీరో విజయ్‌దేవరకొండ అనేది అందరికీ తెలిసిన విషయమే. ‘అర్జున్‌రెడ్డి’ నుంచి వేదికలలో ఇంటర్వ్యూలు, బూతులు మాట్లాడటం, తనకి నచ్చినట్లు ప్రవర్తించడం, పెద్దవారిని అవమానకరంగా మాట్లాడటం వంటివి చూస్తేనే ఉన్నాం. ఆయన క్రేజ్, ఆయనకు అతి తక్కువ కాలంలో వచ్చిన సెన్సేషనల్ స్టార్ ఇమేజ్ మీద ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు లేవు కానీ ఆయన దూకుడు, అంతా నా ఇష్టం అనే బిహేవియర్‌పై మాత్రం విమర్శలు ఉన్నాయి.
అతి తక్కువ చిత్రాలతోనే తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని, అక్కడ కూడా తన సత్తా చాటాలని ఆయన తొందరపడ్డాడేమో అనిపించకమానదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున నుంచి పవన్‌కళ్యాణ్, మహేష్‌లు కూడా పరభాషా దర్శకులు, బాలీవుడ్, కోలీవుడ్ వంటిభాషల్లో ఎంట్రీ విషయంలో పలుతప్పులు చేశారు. కానీ వారు ఎంతో అనుభవం తర్వాత కూడా దెబ్బతింటే, విజయ్ అనుభవం లేకుండానే దెబ్బతిన్నాడు. నోటా చిత్ర దర్శకుడు చేసిన ఇంతకు ముందు రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక జ్ఞానవేల్‌రాజా వంటి నిర్మాత సినిమా తీస్తుంటే అందులో పస ఉంటే అల్లుఅరవింద్ కూడా భాగస్వామి అయ్యేవాడు. అందునా ‘నోటా’ని బన్నీ తిరస్కరించాడు. దీంతో ఏమూలనో కాస్త అనుమానాలైతేఉన్నాయి.
కానీ పొలిటికల్ థ్రిల్లర్ కావడం, ఎన్నికల సీజన్, ఇతర పార్టీ నాయకులు సినిమా విడుదలను ఆపేయాలని కోరడం వంటివి ప్లస్ అవుతాయని బహుశా విజయ్ భావించి ఉంటాడు. ఈ చిత్రం విషయంలో ఏమైనా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన భారీ ఓపెనింగ్స్ మాత్రమే. నాగార్జున-నానిల ‘దేవదాస్’ కంటే మొదటిరోజు ఈ చిత్రం ఎక్కువ వసూలు చేసింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం కూడా నిరాశాజనకమే. ఇక ‘నోటా’ కథ ముగిసినట్లే.
తమిళదర్శకులను, తమిళ ఎంట్రీని నమ్మి దగాపడిన హీరో జాబితాలో విజయ్ పేరు కూడా చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా పరిస్థితి దారుణం. జస్ట్ ప్రీమియర్స్ మాత్రమే పర్వాలేదనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా 23కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ‘నోటా’కి ప్రేక్షకులు ‘నోటా’ బటన్ నొక్కారు. తొలివీకెండ్‌కి కూడా పట్టుమని 10కోట్లు కూడా షేర్ వసూలు చేయలేకపోవడంతో భారీ నష్టాలు ఖాయం. ఇది బయ్యర్లకు కూడా చెంపపెట్టువంటిది. మొత్తానికి ‘నోటా’కి అందరూ ‘టాటా’ చెప్పేసినట్లే.