తెలుగులో ఇప్పుడు ఎవరి నోట విన్నా నయా స్టార్‌గా సెన్సేషనల్‌స్టార్‌గా ఎదిగిన విజయ్‌దేవరకొండ గురించే. ఈమధ్య కాలంలో రవితేజ, నానిల తర్వాత ఎవరి వారసత్వాలు లేకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్‌గా ఇతనే కనిపిస్తున్నాడు. నిజానికి వారసత్వాలపై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉంటారు. ఉదాహరణకు రాజకీయాలలో వారసత్వాలు ఇప్పుడు ఓ మామూలు విషయంగా మారిపోయింది. వారసత్వాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్ టిడిపిలో, టిఆర్‌ఎస్, డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జెడియస్ నుంచి ప్రతి ఒక్క పార్టీలో ఇదే తంతు. ఇక కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. లోకేష్‌కి, రాహుల్‌గాంధీకి, జగన్‌కి ఉన్నది ఏమిటి? మనకి లేనిది ఏమిటి? అని ఆలోచిస్తే కేవలం వారసత్వం , ఆర్దికబలాలే తేడా అనేది అర్థం అవుతుంది. ఇక రాజకీయ నాయకుల వారసులు రాజకీయనాయకులు అవుతున్నారు. డాక్టర్ల వారసులు డాక్టర్లు అవుతున్నారు. మరి సినిమా వారి వారసులు సినిమా నటులు కావడం తప్పేమిటి ?
కొంతకాలం వరకు మాత్రమే వారసత్వం అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మాత్రం టాలెంట్ ఉంటేనే పైకి ఎదుగుతారని రమేష్‌బాబు, సుమంత్, దాసరి అరుణ్ వంటి ఉదాహరణలు ఎన్నోచూపుతారు. అయితే కేవలం నటీనటుల వారసులే నటీనటులు అవుతున్నారు. కానీ గవాస్కర్ కుమారుడు గొప్పక్రికెటర్ కాగలిగాడా? బిన్నీ కుమారుడి పరిస్థితి ఏమిటి? సచిన్ కుమారుడు అర్జున్ టీంలోకి వస్తాడా? బాలు కుమారుడు, వేటూరి వారసులు, ఘంటసాల కుమారులు ఎందుకు అదే రంగాలలోకి రాలేకపోయారు? అనేది పాయింట్.
ఇక తాజాగా విజయ్‌దేవరకొండ వారసత్వాలపై మాట్లాడుతూ.. సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. కోట్లు పెట్టే నిర్మాతలు ఆ డబ్బు ఎంత వరకు తిరిగి వస్తుందనే భరోసా చూసుకుంటారు. వారసత్వ హీరోలకు ఆల్‌రెడీ ఫ్యాన్స్ ఉండటం అనేది కలసి వచ్చే విషయం. అందుకే నిర్మాతలు దానిని సేఫ్‌గేమ్‌గా భావిస్తారు. కొత్త వాళ్లతో రిస్క్ చేయడానికి ముందుకు రారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని వారు ఇక్కడకు వచ్చి నిలదొక్కుకోవడం కష్టం. ఏడాదికి నావంటి ఒకరిద్దరు కుదురుకుంటారేమో అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు విజయ్ వాళ్ల నాన్న కూడా ఇదే చెప్పాడట. సినిమా హీరోగా నిలదొక్కుకోవడం కంటే సివిల్స్ పాస్‌కావడం సులభం. ఎందుకంటే అక్కడ ఏడాదికి కనీసం 400మందికి చోటు ఉంటుంది. కానీ సినిమారంగంలో ఒకరిద్దరికి కూడా చోటు దక్కడం కష్టమని చెప్పినా తానుపట్టుదలతో ఇదే రంగంలోకి వచ్చానని చెప్పుకొచ్చాడు.