ఇందిరా గాంధీ కోడలిగా, సంజయ్‌గాంధీ భార్యగా, వరుణ్‌గాంధీ తల్లిగా బిజెపి నాయకులరాలైన మేనకాగాంధీకి పేరుంది. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన ఆమె నాటి ఎన్డీయే హయాంలో జంతువుల హక్కులు, మహిళల హక్కుల కోసం ఎంతో పోరాటం చేసింది. కానీ మోదీ హయాంలో మాత్రం ఆమె హవా లేకుండా పోయింది. మోదీ ఒక నియంత అనేది తెలిసిందే. తనని కాని వారిని ఆయన అసలు ఎదగనీయడు సరికదా.. తన ప్రమేయం లేకుండా ఎవ్వరూ దేనిపై స్పందించినా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడతాడు. అందుకే ప్రతి విషయంపై, మరీ ముఖ్యంగా మహిళ, బాలిక, శిశువుల సమస్యల గురించి మాట్లాడాల్సిన బిజెపిలోని సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ వంటి వ్యక్తులు కూడా కథువా, ఉన్నవా ప్రాంతాలలో ఎంతో చిన్నవయసు ఉన్న బాలికలను రేప్ చేసి, ఒక ఘటనలో రేప్‌కి గురైనా ఎనిమిదేళ్ల బాలికను చంపి వేశారు.
మరో కేసులో బాధితురాలి తండ్రినే వేధించి చావుకి కారణం అయ్యారు. దేశమొత్తం అట్టుడికినా దీనిపై మన మహిళా కేంద్రమంత్రులు, మోదీ మాట్లాడటం లేదు. అదేమంటే బేఠీ బచావో.. బేటీ పడావో అంటూ మన్‌కి బాత్‌లో నీతులు చెప్పే మోదీ కూడా దీనికి హిందు, ముస్లిం మసి పూసి మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇక వీరిపై మాత్రం స్పందించని మేనకాగాంధీ తాజాగా తనుశ్రీ దత్తాకి మాత్రం మద్దతు తెలిపింది. తనుశ్రీ విషయంలో ఆమె మాట్లాడుతూ, 'మనదేశంలో కూడా మీ టూ ఉద్యమం ప్రారంభం కావాలి. ఏ మహిళ అయినా దీని ద్వారా తమకు జరిగిన అన్యాయాలను మాకు తెలుపవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. మేం దానిపై విచారణ జరుపుతాం. తనుశ్రీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బయట పెట్టిందని ప్రజలు అడుగుతున్నారు. హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ లైంగికంగా వేధించాడని ఓ నటీమణి చెప్పినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. కానీ బాధితురాలు ఎప్పుడు ముందుకు వచ్చి చెప్పిందనేది ముఖ్యం కాదు. మనల్ని ఎవరైనా వేధిస్తే అవి బతికున్నంత వరకు మనసును పీడిస్తూనే ఉంటాయని, బాధిస్తుంటాయనే విషయం ఓ మహిళగా నాకు తెలుసు' అని వ్యాఖ్యానించింది.
అంటే సినిమా వారికి ఓ న్యాయం, అనామకులకు ఓన్యాయమా? మేనకా..! ఇకపోతే తనుశ్రీ కేవలం ఈ పబ్లిసిటీ ద్వారా బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని, ఆమెకి బిగ్‌బాస్‌లో అవకాశం ఇస్తే తీవ్రపరిణామాలుంటాయని దీనికి కూడా మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆందోళనలు మొదలుపెట్టడంతో దీనికి కూడా ప్రాంతీయ, మత రంగు పులుముతున్నారనేది అర్ధం అవుతోంది.