కృత్రిమంగా, బంధాలకు, అనుబంధాలకు తావు లేకుండా పోతున్న పరిశ్రమలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని అనిపిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన సందర్బంగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్, బన్నీ.. వంటి వారు వెళ్లి పలకరించడం, మరీముఖ్యంగా పవన్ అయితే తాను ఆయన దర్శకత్వంలో నటించేంత నటుడిని కాదని, ఆయన గురించి మాట్లాడే అర్హత తనకు లేదని చెప్పడం నిజంగా అభినందనీయం.
ఇక తాజాగా అన్నపూర్ణ తర్వాత తెలుగులో అమ్మగా మాట్లాడిన సుధ ఇటీవల వెల్లడించిన కొన్ని వాస్తవాలు కూడా కదిలించే విధంగా ఉన్నాయి. బాలచందర్ వంటి దర్శకుని చేతిలో తాను హీరోయిన్‌గా పరిచయమై, తనకు హీరోయిన్ ఫీచర్స్ లేవని, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించమని బాలచందర్ చెప్పిన విషయాన్ని ఆమె ఏ మాత్రం దాచుకోలేదు. తనకు ఒకసారి అపెండిసైటిస్ వచ్చినప్పుడు, మరోసారి 'రావోయి చందమామ' షూటింగ్‌లో దెబ్బలు తగిలి, కొన్ని అవయవాలు పనిచేయని పరిస్థితుల్లో నాగార్జున తనకు చేసిన సాయం గురించి చెప్పి తాను ఇప్పటికీ బతికున్నానంటే నాగార్జునే కారణమని చెప్పింది. ఇక తాను ఎంతగానో అభిమానించే బాలచందర్, ఉదయ్‌కిరణ్, సౌందర్య, శ్రీహరి వంటి వారి మరణాన్ని తట్టుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఉద్వేగానికి లోనైంది.
ఉదయ్‌కిరణ్‌కి వివాహం క్యాన్సిల్ అవ్వడం, తల్లి మరణంతో కుంగిపోయిన ఉదయ్‌కిరణ్ తనను అమ్మా అని పిలిచే వాడని, తన కూతురితో ఆడుకునే వాడని, ఓ సారి బోరున ఏడ్చాడని తెలిపింది. అదే ఉదయ్‌కిరణ్‌ని తాను దత్తత తీసుకుని, తన దగ్గరే ఉంచుకుంటే బతికి ఉండేవాడని విలపించింది. నిజమే.. ఇవ్వన్నీ వాస్తవాలే. ముఖ్యంగా ఆమె చెప్పినట్లు ఉదయ్‌ని ఆమె దత్తత తీసుకుని ఉంటే ఆయనకు ఆ ఆప్యాయత లభించి.. బతికి ఉండేవాడేమో...!